1 John 4
"ప్రియులారా, అనేకులైన అబద్ధ ప్రవక్తలు లోకములోనికి బయలు వెళ్లియున్నారు గనుక ప్రతి ఆత్మను నమ్మక, ఆయా ఆత్మలు దేవుని సంబంధమైనవో కావో పరీక్షించుడి."
"యేసుక్రీస్తు శరీరధారియై వచ్చెనని, ఏ ఆత్మ ఒప్పుకొనునో అది దేవుని సంబంధమైనది."
ఏ ఆత్మ యేసును ఒప్పుకొనదో అది దేవుని సంబంధమైనది కాదు; దీనిని బట్టియే దేవుని ఆత్మను మీరెరుగుదురు. క్రీస్తు విరోధి ఆత్మ వచ్చునని మీరు వినిన సంగతి ఇదే; ఇదివరకే అది లోకములో ఉన్నది.
"చిన్నపిల్లలారా, మీరు దేవుని సంబంధులు; మీలో ఉన్నవాడు లోకములో ఉన్నవాని కంటె గొప్పవాడు గనుక మీరు వారిని జయించియున్నారు."
"వారు లోక సంబంధులు గనుక లోక సంబంధులైనట్టు మాట్లాడుదురు, లోకము వారి మాట వినును."
"మనము దేవుని సంబంధులము, దేవుని ఎరిగిన వాడే మన మాట వినును, దేవుని సంబంధి కానివాడు మన మాట వినడు, ఇందు వలన మనము సత్య స్వరూపమైన ఆత్మయేదో, భ్రమపరచు ఆత్మయేదో తెలిసికొనగలుగుచున్నాము. దేవుని ప్రేమ - మనుష్యుని ప్రేమ"
"ప్రియులారా, మనము ఒకనినొకడు ప్రేమింతము; ఏలయనగా ప్రేమ దేవుని మూలముగా కలుగుచున్నది; ప్రేమించు ప్రతివాడును దేవుని మూలముగా పుట్టినవాడై దేవుని ఎరుగును."
"దేవుడు ప్రేమాస్వరూపి, ప్రేమలేనివాడు దేవుని ఎరుగడు."
"మనము ఆయన ద్వారా జీవించునట్లు, దేవుడు తన అద్వితీయ కుమారుని లోకములోనికి పంపెను; దీనివలన దేవుడు మనయందుంచిన ప్రేమ ప్రత్యక్షపరచబడెను."
"మనము దేవుని ప్రేమించితిమని కాదు, తానే మనలను ప్రేమించి, మన పాపములకు ప్రాయశ్చిత్తమైయుండుటకు తన కుమారుని పంపెను; ఇందులో ప్రేమయున్నది."
"ప్రియులారా, దేవుడు మనలను ఈలాగు ప్రేమింపగా మన మొకనినొకడు ప్రేమింపబద్ధులమై యున్నాము."
ఏ మానవుడును దేవుని ఎప్పుడును చూచియుండ లేదు; మనమొకని నొకడు ప్రేమించిన యెడల దేవుడు మనయందు నిలిచియుండును; ఆయన ప్రేమ మనయందు సంపూర్ణమగును.
"దీని వలన మనము ఆయన యందు నిలిచియున్నామనియు ఆయన మన యందున్నాడనియు తెలిసికొనుచున్నాము; ఏలయనగా, ఆయన మనకు తన ఆత్మలో పాలు దయచేసియున్నాడు."
"మరియు తండ్రి తన కుమారుని లోక రక్షకుడుగా ఉండుటకు పంపియుండుట మేము చూచి, సాక్ష్యమిచ్చుచున్నాము."
"యేసు దేవుని కుమారుడని ఎవడు ఒప్పుకొనునో, వానిలో దేవుడు నిలిచియున్నాడు, వాడు దేవుని యందున్నాడు."
"మన యెడల దేవునికి ఉన్న ప్రేమను మన మెరిగిన వారమై దాని నమ్ముకొనియున్నాము; దేవుడు ప్రేమా స్వరూపియై యున్నాడు; ప్రేమ యందు నిలిచి యుండువాడు దేవుని యందు నిలిచియున్నాడు, దేవుడు వానియందు నిలిచియున్నాడు."
తీర్పు దినమందు మనకు ధైర్యము కలుగునట్లు దీనివలన ప్రేమ మనలో పరిపూర్ణము చేయబడియున్నది; ఏలయనగా ఆయన ఎట్టివాడై యున్నాడో మనము కూడ ఈ లోకములో అట్టివారమైయున్నాము.
"ప్రేమలో భయముండదు; అంతేకాదు; పరిపూర్ణ ప్రేమ భయమును వెళ్లగొట్టును, భయము దండనతో కూడినది, భయపడువాడు ప్రేమయందు పరిపూర్ణము చేయబడినవాడు కాడు."
ఆయనే మొదట మనలను ప్రేమించెను గనుక మనము ప్రేమించుచున్నాము.
"ఎవడైనను నేను దేవుని ప్రేమించుచున్నానని చెప్పి, తన సహోదరుని ద్వేషించిన యెడల అతడు అబద్ధికుడగును; తాను చూచిన తన సహోదరుని ప్రేమింపని వాడు తాను చూడని దేవుని ప్రేమింప లేడు."
దేవుని ప్రేమించువాడు తన సహోదరుని కూడ ప్రేమింప వలెనను ఆజ్ఞను మన మాయన వలన పొందియున్నాము.